Siddharth Shukla: నిర్లక్ష్యంగా కారు నడిపి వాహనాల ధ్వంసానికి కారణమైన హిందీ టీవీ నటుడు సిద్ధార్థ్ అరెస్ట్!

  • కారుపై నియంత్రణ కోల్పోయిన నటుడు
  • డివైడర్ మీదుగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వైనం
  • పలు కార్లు ధ్వంసం
నిర్లక్ష్యంగా కారునడిపి పలు వాహనాలను ధ్వంసం చేసిన హిందీ టీవీ నటుడు సిద్ధార్థ శుక్లాను ముంబైలోని ఒషివారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఎండబ్ల్యూ కారును ర్యాష్‌గా డ్రైవ్ చేసి ఓ వ్యక్తిని గాయపరచడంతో పాటు మూడు కార్లను  సిద్ధార్థ్ ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు. డివైడర్ మీదుగా కారు నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్టు చెప్పారు.

ఈ ఘటనలో రాజ్‌కుమార్ దూబే అనే వ్యక్తి కారు ధ్వంసమైందని, అందులో ఉన్న రాజ్‌కుమార్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కారుపై సిద్ధార్థ్  నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. అతడి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత అతడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

ప్రస్తుతానికైతే అతడు మద్యం సేవించి డ్రైవ్ చేసినట్టు ఆధారాలు లేవన్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోలేదన్నారు. స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసినట్టు  వివరించారు. ప్రమాదం తర్వాత సిద్ధార్థ్ ఘటనా స్థలం నుంచి పారిపోలేదని, అక్కడే ఉన్నాడని, దర్యాప్తుకు సహకరిస్తున్నాడని పేర్కొన్నారు. సెక్షన్ 279 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Siddharth Shukla
BMW crashes
TV actor
Mumbai

More Telugu News