Chandrababu: ఢిల్లీలో పార్టీ ఎంపీలతో ముగిసిన చంద్రబాబు భేటీ
- అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు
- భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలకు దిశానిర్దేశం
- రాష్ట్ర ఎంపీల పోరాటాన్ని అభినందించిన చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపే నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ లోపల, వెలుపల పోరాటాన్ని కొనసాగించాలని, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు. నిన్న పార్లమెంట్ లో రాష్ట్ర ఎంపీల పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు. అదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగించాలని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రానికి తెలియజేయాలని ఎంపీలకు సూచించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరారు.