Kukatpalli: కిలో రూ. 6 విలువైన కరక్కాయలను తెచ్చి, కోట్లకు మోసం చేసిన కేసులో... ఐదుగురు అమ్మాయిల అరెస్ట్!

  • కూకట్ పల్లిలో బట్టబయలైన 'కరక్కాయల పొడి' దందా
  • సంస్థలో పనిచేస్తున్న ఐదుగురి అరెస్ట్
  • అసలు నిందితుని కోసం పోలీసుల వేట
కూకట్ పల్లిలో కరక్కాయల పేరిట భారీ మోసానికి పాల్పడిన కేసులో సదరు సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు యువతులను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సాధారణంగా అడవుల్లో లభించే కరక్కాయలను గిరిజనులు సేకరించి విక్రయిస్తుంటారు. దీనికి గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 6. అంటే ఎంతమంది దళారీల చేతులు మారినా, బహిరంగ మార్కెట్లో రూ. 20 నుంచి 30కి ధర మించదు.

 అటువంటి కరక్కాయలను కిలోను రూ. 1000కి విక్రయించిన ఓ ముఠా, దాన్ని పొడిచేసి తిరిగి ఇస్తే రూ. 1300 ఇస్తామంటూ పేపర్లలో, టీవీ చానళ్లలో ప్రకటనలు ఇచ్చింది. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డునెంబర్‌ 1లో సాఫ్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన మల్లికార్జున్ అనే వ్యక్తి యూట్యూబ్ లో కరక్కాయలు వాడితే కలిగే లాభాలను, పతంజలి వంటి ఆయుర్వేద కంపెనీలు దీన్ని ఏఏ ప్రొడక్టుల్లో వినియోగిస్తాయో చెబుతూ, ప్రజల్లో ప్రచారం చేసుకున్నాడు.  పలు టీవీ చానళ్లలో 6309390734 ఫోన్‌ నంబర్‌ తో సహా ప్రకటనలు ఇచ్చాడు.

దీంతో నమ్మిన మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా గృహిణులు భారీగా కరక్కాయలను వారి దగ్గర కొని పొడి చేసి తీసుకొచ్చారు. తొలి నాళ్లలో చెప్పినట్టుగానే రూ. 1300 ఇచ్చే సరికి ఎంతో మంది ఆకర్షితులయ్యారు. వేల నుంచి లక్షల్లోకి వ్యాపారం మారింది. కొందరు మహిళలు ఇదే తమకు పనిగా భావించి, రోజుకు 20 కిలోల వరకూ తీసుకెళ్లి దంచుకుని తెచ్చారు కూడా.

ఇలా వందల మంది నుంచి కోట్లు దండుకున్న సంస్థ రెండు రోజుల క్రితం ప్లేటు ఫిరాయించింది. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు, సదరు సంస్థలో పనిచేస్తూ, వీధుల్లో ప్రచారం చేయడం, కరక్కాయల పొడిపై ఫోన్లలో ఆడవాళ్లకు చెప్పడం, వచ్చిన వారి నుంచి 1000 తీసుకుని కాయలను ఇవ్వడం వంటి పనులు చేసిన ఐదుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు.
Kukatpalli
Karakkayalu
Hyderabad
Police

More Telugu News