క్రొయేషియా: జగజ్జేత ఫ్రాన్స్ .. ఓడినా హృదయాలు గెలుచుకున్న క్రొయేషియా!
- ఫిఫా 2018 కప్ గెలిచిన ఫ్రాన్స్
- 4-2 తేడాతో క్రొయేషియాపై ఘనవిజయం
- పసికూనపై రెచ్చిపోయి ఆడిన ఫ్రాన్స్ ఆటగాళ్లు
- పలు అవకాశాలను గోల్స్ గా మలచలేకపోయిన క్రొయేషియా
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా నిలిచింది. 2018 ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఆదివారం ఫ్రాన్స్ ప్రభంజనం సృష్టించింది. ఈ సీజన్‌లో అద్భుత విజయం సాధించి ఫైనల్స్ కు చేరిన అతి చిన్న దేశం క్రొయేషియాపై ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ అద్భుత విజయం సాధించింది. మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 సంవత్సరాల తరువాత విశ్వవిజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, 18వ నిమిషం వద్ద ఫ్రాన్స్ కు వచ్చిన ఫ్రీకిక్‌లో క్రొయేషియా స్ట్రైకర్ మారియో సెల్ఫ్ గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. ఆ తరువాత 28వ నిమిషం వద్ద ఇవాన్ పెరిసిక్ అద్భుత గోల్ సాధించి క్రొయేషియా ఖాతా తెరిచాడు. ఆ తరువాత 36వ నిమిషం వద్ద పెనాల్టీ కిక్ ద్వారా ఫ్రాన్స్ మరొక గోల్ సాధించింది. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి ఫ్రాన్స్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.
ఫ్రాన్స్ క్రీడాకారులు ద్వితీయార్ధంలో రెచ్చిపోయారు. 59వ నిమిషంలో పాల్ పోగ్బా, 65వ నిమిషంలో ఎంబాప్పే గోల్స్ సాధించి జట్టుకు అద్భుతమైన ఆధిక్యాన్ని అందించారు. దీంతో క్రొయేషియా డిఫెన్స్ లో పడిపోయింది. ఈ దశలో మారియో అద్భుతమైన గోల్ సాధించి క్రొయేషియాకి కాస్త ఉపశమనం కల్పించాడు. ఆ తరువాత క్రొయేషియాకు గోల్స్ సాధించేందుకు పలు అవకాశాలు వచ్చినా దానిని వినియోగించుకోలేకపోయింది. మరొక వైపు ఫ్రాన్స్ కూడా క్రొయేషియాకు గోల్ సాధించేందుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా ఫ్రాన్స్ ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఫ్రాన్స్ జట్టు కోచ్ దీదియర్ దెస్‌చాంప్స్ కు కూడా ఇది రెండవ ప్రపంచ కప్, 1998లో ఫ్రాన్స్ జట్టులో సభ్యుడుగా దెస్‌చాంప్స్ కప్ అందుకున్నాడు.