Harmanpreet Kaur: ఆ ఆరోపణలు తప్పు.. నేను డిగ్రీ పాసయ్యా!: టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్

  • వివాదంపై స్పందించిన హర్మన్
  • డిగ్రీ పూర్తి చేశానని వివరణ
  • అదే డిగ్రీతో ఇండియన్ రైల్వేలోనూ పనిచేశానన్న స్కిప్పర్
తనపై వస్తున్న ఆరోపణలపై టీమిండియా మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29) స్పందించింది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి డీఎస్పీ ఉద్యోగం పొందినట్టు తేలడంతో పంజాబ్ పోలీస్ శాఖ ఇటీవల ఆమెను తప్పించింది.

గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హర్మన్ ప్రీత్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఇందుకోసం ఆమె మీరట్‌లోని చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టు చెబుతూ డిగ్రీ పట్టాను సమర్పించింది. అయితే, విచారణలో అసలామె అక్కడ చదువుకోలేదని తేలింది. దీంతో, ఆమెను డీఎస్పీ ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు, ఆమె కెరియర్‌ను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆమె ఇష్టపడితే కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

ఈ వివాదంపై హర్మన్ ప్రీత్ తాజాగా స్పందించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, తాను అన్ని పరీక్షలు పాసయ్యానని తెలిపింది. తన డిగ్రీ సర్టిఫికెట్ అసలైనదేనని స్పష్టం చేసింది. అంతేకాదు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో కూడా చేరానని, అయితే, క్రికెట్ వల్ల దానిని కొనసాగించలేకపోయానని వివరించింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీస్ శాఖ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం తనకు అందలేదని పేర్కొంది. తాను ఇదే డిగ్రీపై రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ముంబైలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసింది.
Harmanpreet Kaur
skipper
degree
fake

More Telugu News