Tamilnadu: మాక్ డ్రిల్ లో 'దూకెయ్... దూకెయ్' అంటూ నెట్టేశాడు... విద్యార్థిని దుర్మరణం... వీడియో!

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • రెండో అంతస్తు నుంచి కిందకు నెట్టేసిన ట్రయినర్
  • తలకు గాయాలతో విద్యార్థిని లోకేశ్వరి మృతి
తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్, ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయట పడాలన్న విధానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు కళైమగన్ ఆర్ట్స్ కళాశాలలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింద విద్యార్థులంతా ఓ నెట్ పట్టుకుని నిలుచుండగా, రెండో అంతస్తు నుంచి లోకేశ్వరి అనే విద్యార్థిని కిందకు దూకేందుకు అంగీకరించింది.

ఆపై రెండో అంతస్తుపై నుంచి ఆమె దూకేందుకు సందేహిస్తుండగా, మాక్ డ్రిల్ ట్రయినర్ ఆమెను "దూకేయ్.. దూకేయ్" అంటూ ప్రోత్సహించాడు. లోకేశ్వరి భయపడుతుంటే కిందకు నెట్టేశాడు. కింద పడుతున్న సమయంలో ఆమె తల మొదటి అంతస్తుకు ఉన్న సన్ షేడ్ కు బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలపై మాక్ డ్రిల్ ట్రయినర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tamilnadu
Coimbattore
Mock Drill
Death

More Telugu News