Amit shah: రజనీకాంత్‌ను లాక్కునేందుకు బీజేపీ వ్యూహం.. సూపర్ స్టార్‌తో పొత్తు కోసం అమిత్ షా పావులు

  • ‌రజనీకాంత్‌తో పొత్తు కోసం బీజేపీ యత్నాలు
  • కొత్త పార్టీతో కలిసి కొత్త కూటమి
  • పావులు కదుపుతున్న కమల నాథులు
కర్ణాటకలో అధికారంలోకి రావాలని శత విధాలా ప్రయత్నించి బోల్తా పడిన బీజేపీ ఇప్పుడు తమిళనాడుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నటుడు రజనీకాంత్‌తో కలిసి నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలో ప్రకటించనున్న పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ చీఫ్ అమిత్ షా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే, డీఎంకేలతో ప్రమేయం లేకుండా రజనీతో వెళ్లడమే బెటరన్నది అమిత్ షా యోచనగా తెలుస్తోంది.

నిజానికి జయలలిత మరణం తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తీసుకుని ఆడించాలని చూసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో తమిళ ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురి కావాల్సి వచ్చింది. మొదట్లో పళని స్వామిని వ్యతిరేకించిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత పళనితో కలిశారు. ఇందుకు బీజేపీనే కారణమని ఓ సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పారు.

అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ ఓ బహిరంగ సభలో అన్నాడీఎంకే పాలనపై అమిత్ షా దుమ్మెత్తి పోశారు. తమిళనాడులో అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మధ్య చెడినట్టు స్పష్టమైంది. ఇప్పుడు ర‌జనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొత్త కూటమి ఏర్పాటు చేసి తమిళనాట అధికారాన్ని చలాయించాలన్నది అమిత్ షా తాజా వ్యూహంగా కనిపిస్తోంది.
Amit shah
BJP
Tamil Nadu
Rajinikanth

More Telugu News