Supreme Court: పంచాయతీ రాజ్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళతాం: తెలంగాణ సీఎం కేసీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
పంచాయతీ రాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ధరించాలని కోరాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

దీని కోసం అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడానికి రేపు కేబినెట్‌ సబ్‌ కమిటి సమావేశం కావాలని ఆయన ఆదేశించారు. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించి, తెలంగాణలోని పంచాయతీ రాజ్‌ సంస్థల్లో 61 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే విధంగా వాదనలు ఖరారు చేయాలని అన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ సర్పంచ్‌ స్వప్నా రెడ్డి ద్వారా కాంగ్రెస్‌ నేతలు పిటిషన్‌ వేయించి, ఈ రిజర్వేషన్లకు గండి కొట్టించేలా చేశారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడానికి రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Supreme Court
Telangana
KCR

More Telugu News