team India: రోహిత్ శర్మ అజేయ సెంచరీ.. మూడో టీ20లో భారత్ గెలుపు.. సిరీస్ వశం!

  • ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం
  • 2-1తో టీ20 సిరీస్ భారత్ కైవసం
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ

మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం బ్రిస్టల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. ఫలితంగా 2-1తో సిరీస్ భారత్ సొంతమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. తొలుత వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. 94 పరుగుల వరకు ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. దీంతో భారీ విజయ లక్ష్యం తప్పదని భావించారు.

అయితే, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెచ్చిపోయి వరుసపెట్టి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పరుగుల వేగం తగ్గింది. జాసన్ రాయ్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 21 బంతుల్లో 7 ఫోర్లతో 34, అలెక్స్ హేల్స్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్ చెరొకటి, సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ (నాటౌట్) చేశాడు. కెప్టెన్ కోహ్లీ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. అజేయ సెంచరీ చేసిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నెల 12 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

More Telugu News