family planning: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా గర్భం దాల్చిన మహిళ.. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం!

  • ఇద్దరు పిల్లలు చాలు అనుకున్న భార్యాభర్తలు
  • ఫెయిల్ అయిన కు.ని. ఆపరేషన్
  • ముచ్చటగా మూడో బిడ్డ జననం
ఇక పిల్లలు చాలు అనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ... మళ్లీ గర్భం దాల్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని చమ్రోలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, సుధ (28), బసంత్ కుమార్ లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇద్దరు పిల్లలు చాలు అని వీరు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలు పుట్టకుండా సుధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ గర్భం దాల్చింది. దీంతో, భార్యాభర్తలిద్దరూ షాక్ కు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా... కు.ని. ఆపరేషన్లలో రెండు శాతం వరకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవలే సుధ మూడో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతూ, కు.ని. ఆపరేషన్ ఫెయిల్ అయితే.. ప్రభుత్వం రూ. 30 వేలు నష్టపరిహారంగా ఇస్తుందని చెప్పారు.
family planning
operation
fail

More Telugu News