Kadapa District: ప్రొఫెసర్ ను ప్రేమించి, కిడ్నాప్ డ్రామా ఆడి... హైదరాబాద్ లో ప్రేమ వివాహం!

  • తనను కిడ్నాప్ చేశారని మెసేజ్ పెట్టిన లక్ష్మీ ప్రసన్న
  • ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు
  • ప్రియుడితో హైదరాబాద్ వచ్చి వివాహం
కడపలో తనను ఎవరో కిడ్నాప్ చేశారని, రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వాట్స్ యాప్ లో మెసేజ్ లు పెట్టి తల్లిదండ్రులు, పోలీసులను ఉరుకులు పెట్టించిన లక్ష్మీ ప్రసన్న, ప్రేమ వివాహం చేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్న ఆమె, ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ సమాచారం కూడా ఆమె నుంచే రావడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప నగర శివార్లలో ఉన్న ఓ ప్రైవేటు విద్యాసంస్థలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న  అట్ల సాయికేశవ్‌ రెడ్డి అనే యువకుడిని, అదే కాలేజీలో చదువుకుంటున్న లక్ష్మీ ప్రసన్న ప్రేమించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు.

ఓ బురఖా ధరించి, కడప బస్టాండ్ నుంచి కర్నూలుకు బయలుదేరిన ఆమె, ఆళ్లగడ్డలో ప్రియుడిని కలిసింది. ఇద్దరూ కలసి నంద్యాల మీదుగా హైదరాబాద్ వెళ్లి, ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను, ఓ వీడియోను రికార్డు చేసి పోలీసులకు, స్నేహితులకు పంపించారు. తాను ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని, ఎవరి బలవంతం లేదని, తన గురించి వెతకవద్దని తెలిపింది. యువతి ప్రేమ వివాహం చేసుకున్నట్టు సమాచారం వచ్చిందని చెప్పిన కడప చిన్న చౌక్ సీఐ రామకృష్ణ, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిడ్నాప్, అత్యాచారం అంతా డ్రామాయేనని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Kadapa District
Hyderabad
Aryasamaj
Marriage
Lovers
Professor

More Telugu News