Pawan Kalyan: నా కుమారుడంత వయసున్న చిన్నారిని పట్టుకుని చూశా.. ఒళ్లంతా చర్మవ్యాధులే!: పవన్‌ కల్యాణ్‌ ఆవేదన

  • ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది
  • అరకులో చిన్నారులకు చర్మ వ్యాధులు, రక్తహీనత, రేచీకటి 
  • సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతాను
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రేపటి నుంచి విశాఖపట్నం జిల్లాలో మళ్లీ ప్రజా పోరాట యాత్ర చేయనున్నారు. ఈరోజు విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో ఆయన చర్చించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై పలువురు మేధావులు ప్రసంగించారు. ప్రొ. కేఎస్ చలం, ప్రొ. కేవీ రమణ, ప్రజా గాయకుడు వంగపండు, వామపక్ష ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తూ.. స్థానికుల సమస్యలను నాయకులు అర్థం చేసుకోవాలని, ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం ఉందని, ఈ విషయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని అన్నారు.

సమస్యలు గుర్తించి, పరిష్కరించకపోతే మరోసారి విభజన సమస్యలు వస్తాయని పవన్ కల్యాణ్‌ అన్నారు. అలా జరిగితే చాలా నష్టపోతామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని, వైద్యులు అందుబాటులో ఉండట్లేదని చెప్పారు. ఇటీవల తాను అరకు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి మారుమూల ప్రాంత చిన్నారులను చూశానని, రక్తహీనత, రేచీకటి, చర్మ సంబంధ వ్యాధులు ఉన్నాయని అన్నారు.

తన కుమారుడంత వయసున్న చిన్నారులు ఉన్నారని, వారిని పట్టుకుని చూస్తే ఒళ్లంతా చర్మ వ్యాధులతో కనపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వైద్యులు లేరని, అంబులెన్సులు కూడా లేవని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.                                                      
Pawan Kalyan

More Telugu News