raghuveera reddy: కర్ణాటక అధికారులకు రఘువీరారెడ్డి సూచనలు.. వివాదాస్పదమైన సమావేశం!

  • పావగడ తాలూకాలో అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన రఘువీరా
  • కర్ణాటక అధికారుల సమావేశంలో ఆయన ఎలా పాల్గొంటారంటూ పలువురి ప్రశ్న
  • తామే ఆహ్వానించామన్న మంత్రి వెంకటరమణప్ప

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై కర్ణాటకలో దుమారం రేగింది. తుముకూరు జిల్లా పావగడ తాలూకా పంచాయతీలో అధికారులను ఉద్దేశించి రఘువీరా ప్రసంగించారు. అధికారులకు రఘువీరా కొన్ని సూచనలు చేసినట్టు టీవీ ఛానళ్లలో ప్రసారం అయింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెంకటరమణప్ప సమక్షంలోనే ఇది చోటు చేసుకుంది. దీంతో ఏపీకి చెందిన నాయకుడైన రఘువీరా ఏ హోదాతో కర్ణాటక అధికారుల సమావేశంలో పాల్గొన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదంపై మంత్రి వెంకటరమణప్ప స్పందించారు. తన ఆహ్వానం మేరకే రఘువీరా వచ్చారని, ఆయనకు సన్మానం చేశామని చెప్పారు. తన కోరిక మేరకే ఆయన కాసేపు తెలుగులో ప్రసంగించారని తెలిపారు. తుంగభద్ర బ్యాక్ రివర్ వాటర్ ను గతంలో 200 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ద్వారా హిందూపురం, మడకశిర ప్రాంతాలకు తరలించామని సమావేశంలో రఘువీరా చెప్పారని... పావగడ ప్రాంతంలో కూడా తాము తుంగభద్ర బ్యాక్ రివర్ వాటర్ ను ఉపయోగించుకోవాల్సి ఉందని...  ఈ నేపథ్యంలో గతంలో మంత్రిగా పని చేసిన ఆయన అనుభవాన్ని, ప్రాజెక్టును అమలు చేసిన తీరును తెలుసుకున్నామని చెప్పారు. రఘువీరా సూచనలు కర్ణాటక ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని మీడియాను కోరారు. 

More Telugu News