japan earth quake: జపాన్ లోని ఒసాకాను వణికించిన భూకంపం... ముగ్గురు మృతి
- 100 మందికిపైగా గాయాలు
- 1920 తర్వాత అక్కడ ఇదే బలమైన భూకంపం
- మరికొన్ని తదుపరి ప్రకంపనలు ఉంటాయని హెచ్చరిక
జపాన్ లోని ఒసాకా పట్టణాన్ని ఈ రోజు ఉదయం బలమైన భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.58 గంటలకు వచ్చిన ఈ భూకంపం ధాటికి ప్రజలు భయపడి రోడ్లపైకి వచ్చేశారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, 100 మందికి పైగా గాయపడినట్టు ప్రాథమిక సమాచారం.
విద్యుత్ సరఫరా నిలిచిపోగా, రైళ్ల సర్వీసులు ఆగిపోయాయి. ఒసాకా ప్రాంతంలో 1920 తర్వాత వచ్చిన బలమైన భూకంపం ఇదే. చాలా ఇళ్లకు విద్యుత్ ను పునరుద్ధరించారు. రానున్న రెండు మూడు రోజుల్లో బలమైన తదుపరి ప్రకంపనలు రావచ్చని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది. ఒసాకా సమీపంలోని అణు విద్యుత్ ప్లాంట్లకు నష్టం జరిగినట్టు ఎటువంటి సమాచారం లేదని కేబినెట్ సెక్రటరీ యోషిహిడే సుగా తెలిపారు.