తొలి చాన్స్ చంద్రబాబుదే... మోదీని కడిగేసిన ఏపీ సీఎం!
- ఢిల్లీలో నీతి ఆయోగ్ నాలుగో సమావేశం
- తన ప్రసంగంలో కేంద్రంపై చంద్రబాబు విమర్శలు
- పలు డిమాండ్లను కేంద్రం ముందుంచిన చంద్రబాబు
ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని మరోసారి గుర్తు చేసిన ఆయన, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడం లేదని, అసలు హామీలు నెరవేర్చే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకుంటే, ప్రజలు కేంద్రంపై విశ్వాసాన్ని కోల్పోతారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి నిధులు సమకూర్చాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పోలవరం బాధితుల పునరావాసానికి కావాల్సిన నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఆగిపోయాయని, తాము లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని ఆరోపించడం ఎంతవరకూ సబబని చంద్రబాబు ప్రశ్నించారు. రెవెన్యూ లోటు విషయంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించారని నిప్పులు చెరిగిన ఆయన, గతంలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలని అన్నారు.