bjym: రాయలసీమ కోసం టీడీపీ దొంగ దీక్షలు చేయక్కర్లేదు: బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రాన్ని చంద్రబాబు ఏ రోజైనా కోరారా?
  • ఇన్నేళ్లూ  సీమ అభివృద్ధికి పాటుపడకుండా ఇప్పుడు దీక్షలా?
  • కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ను బీజేపీ కచ్చితంగా ఏర్పాటు చేస్తుంది
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయమని సీఎం చంద్రబాబు ఏ రోజూ కేంద్రాన్ని కోరలేదని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లూ రాయలసీమ అభివృద్ధికి పాటుపడని టీడీపీ నేతలు ఇప్పుడు దొంగ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

బీజేపీతో టీడీపీ పొత్తు కొనసాగిన సమయంలోనే ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయ లేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ను బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి దమ్ముంటే.. ఏపీ రెండో రాజధానితో పాటు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని అన్నారు.
bjym
Vishnu Vardhan Reddy

More Telugu News