YSRCP: ఆత్మరక్షణలో వైసీపీ, బీజేపీ.. దాచినా దాగని నిజం.. లాగ్‌బుక్‌లో మొత్తం వివరాలు!

  • వైసీపీ-బీజేపీ నేతల కలయికపై పక్కా ఆధారాలు
  • లాగ్‌బుక్‌లో నమోదైన వివరాలు
  • దిద్దుబాటు చర్యలకు ఇరు పార్టీలు యత్నం

వైసీపీ-బీజేపీ నేతలు ఢిల్లీలో కలిసి తిరిగినట్టు వస్తున్న వార్తలను ఎంతగా దాస్తున్నప్పటికీ వాస్తవాలు దాగడం లేదు. ఏపీ భవన్ సిబ్బంది సమకూర్చిన ప్రభుత్వ వాహనంకు చెందిన ‘లాగ్‌బుక్’లో నమోదు చేసిన వివరాలు బహిర్గతం కావడంతో వైసీపీ-బీజేపీలు ఆత్మరక్షణలో పడిపోయాయి.

స్నేహితుల్లా కలిసి మాట్లాడుకుంటే తప్పేమిటని ఇప్పటి వరకు వాదించిన వైసీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని టీడీపీ నిలదీస్తోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ నివాసానికి వెళ్లిన బుగ్గన ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. వారు కలుసుకోవడం నేరం కాదు కానీ, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై తాము పోరాడుతుంటే వైసీపీ మాత్రం కేంద్రానికి వత్తాసు పలుకుతోందని టీడీపీ ఆరోపిస్తోంది.

మరోవైపు పీఏసీ చైర్మన్ హోదాలో టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్న బుగ్గన అందుకు సంబంధించిన పత్రాలను రాంమాధవ్‌కు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఈ విషయాన్ని ఖండించినప్పటికీ  సౌత్‌ ఎవెన్యూలోని రాంమాధవ్‌ నివాసానికి బుగ్గన వెళ్లినట్లు తేలింది.

బుధవారం రాత్రి 11:45 గంటలకు ఢిల్లీ వెళ్లిన బుగ్గనకు ప్రొటోకాల్ ప్రకారం ఏపీ భవన్‌ అధికారులు  ప్రభుత్వ కారును సమకూర్చారు. ఆయన కోసం గదిని కూడా కేటాయించారు. గురువారం ఉదయం ప్రభుత్వ కారులోనే బుగ్గన హోటల్ షంగ్రిల్లాకు చేరుకున్నారు. అక్కడ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు.

అనంతరం ఏపీ భవన్‌కు చేరుకుని కాసేపటికే మళ్లీ హోటల్‌కు వెళ్లారు. రెండోసారి, ఆకుల-బుగ్గన ఒకే కారులో ఏపీ భవన్‌కు వచ్చారు. ఏపీ భవన్‌లో బుగ్గన గది ఖాళీ చేసిన అనంతరం రాంమాధవ్ ఇంటికి వెళ్లినట్టు అక్కడి లాగ్‌బుక్‌లో ఎంట్రీ అయింది. అమిత్‌షా, రాంమాధవ్‌లను కలవడానికే బుగ్గన ఢిల్లీకి వచ్చినట్లు బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు.

మరోవైపు పార్టీ పనుల కోసం వచ్చినప్పుడు ప్రభుత్వ కారును ఎందుకు వాడారంటూ ఆకుల సత్యనారాయణపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో నష్ట నివారణ చర్యల కోసం ఆకుల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినా పొంతనలేని సమాధానాలతో మరోమారు దొరికిపోయారు. తొలుత ఏపీ భవన్‌లో బుగ్గనను కలిశానని చెప్పిన ఆయన, ఆ తర్వాత ఇద్దరం కలిసి హోటల్ షంగ్రిల్లాలో మధ్యాహ్నం భోజనం చేసినట్టు అంగీకరించారు.

More Telugu News