Gauri Lankesh: నటుడు గిరీష్ కర్నాడ్ ను కూడా హత్య చేసేందుకు గౌరీ లంకేష్ హంతకుల ప్లాన్!

  • గత సంవత్సరం గౌరీ లంకేష్ హత్య
  • నిందితుడిని ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు
  • అతని హిట్ లిస్ట్ లో పలువురు ప్రముఖుల పేర్లు
కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హత్య చేసిన నిందితులు అదే విధంగా ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ను కూడా హత్య చేయాలని ప్లాన్ చేశారు. గౌరీ లంకేష్ కేసులో ప్రధాన నిందితుడు పరశురామ్ వాగ్మోర్‌ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించగా, హిట్ లిస్టులో నెక్ట్స్ టార్గెట్ గా గిరీష్ కర్నాడ్ ఉన్నట్టు తెలిసింది. సమయం చూసి గిరీష్ ను హత్య చేయాలని తాము ప్లాన్ చేశామని నిందితుడు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. గిరీష్ తో పాటు రాజకీయ నేత బీటీ లలితా నాయక్, నిడుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామి, సీఎస్ ద్వారకాంత తదితరులనూ హత్య చేయాలని పరశురామ్ నిర్ణయించుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

గత సంవత్సరం సెప్టెంబర్ లో గౌరీ లంకేష్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే గిరీష్ కర్నాడ్ ను హత్య చేయాలని నిందితుడు రెక్కీ నిర్వహించాడని, ఇది సమయం కాదని హత్య నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, నిందితుడు పరశురామ్, శ్రీ రామసేన సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కరుడుగట్టిన హిందుత్వ వాది అయిన పరశురామ్, హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న ఆలోచనతో 2012లో సిడంగి అనే ప్రాంతంలో పాకిస్థాన్ జెండాను ఎగురవేశాడని తెలిపారు. కాగా, పరశురామ్ ను కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే.
Gauri Lankesh
Girish Karnad
Murder
Hit List
Parasuram
Arrest

More Telugu News