Facebook: ఫేస్ బుక్ లో మరో వైఫల్యం... బట్టబయలైన 1.4 కోట్ల యూజర్ల పోస్టులు!
- వ్యక్తిగత పోస్టులు జనరల్ పబ్లిక్ తో షేర్
- సాఫ్ట్ వేర్ బగ్ కారణమని గుర్తింపు
- గతనెల 17-28 మధ్య జరిగిన వ్యవహారం
ఫేస్ బుక్ లో మరో వైఫల్యం చోటు చేసుకుంది. ఏకంగా 1.4 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత పోస్టులు బహిర్గతమయ్యాయి. ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకున్న యూజర్లు వ్యక్తిగతంగా పోస్ట్ చేసుకున్నా గానీ అవి జనరల్ పబ్లిక్ తో షేర్ అవడం జరిగింది. సాఫ్ట్ వేర్ బగ్ ఇందుకు కారణంగా భావిస్తున్నారు. గత నెల 18నుంచి 27వ తేదీ వరకు ఈ బగ్ యాక్టివ్ గా ఉంటూ, యూజర్ల ప్రైవసీ సెట్టింగ్స్ ను పబ్లిక్ గా మార్చేసింది. ఇది యూజర్లకు కూడా తెలియకుండా జరిగిపోయింది. ఈ సమస్యను సరిచేశామని, బాధిత 1.4 కోట్ల యూజర్లకు గురువారం ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని ఫేస్ బుక్ తెలిపింది.
‘‘ఈ తప్పుకు క్షమాపణ తెలియజేస్తున్నాం. ప్రభావిత ప్రతీ యూజర్ ను గత నెల 18-27 తేదీల మధ్య పోస్ట్ లను మరోసారి సమీక్షించుకోవాలని సూచించాం’’ అని ఫేస్ బుక్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఎగాన్ సీఎన్ బీసీ వార్తా సంస్థకు తెలిపారు. యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో ఈ మధ్య కాలంలో ఫేస్ బుక్ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలైటికా సంస్థ చోరీ చేయడంతో ఫేస్ బుక్ క్షమాపణలు తెలియజేసింది. చైనాకు చెందిన హువావే, లెనోవో, ఒప్పో, టీసీఎల్ కంపెనీలకు ప్రివిలేజ్ యాక్సెస్ ఇచ్చినట్టు ఫేస్ బుక్ ఇటీవలే మరో ప్రకటన కూడా చేయడం గమనార్హం.