Tamilnadu: ప్లాస్టిక్ ఉత్పత్తులపై తమిళ సర్కారు నిషేధం!

  • 2019 జనవరి 1 నుంచి అమల్లోకి
  • పాలు, పెరుగు, మందుల ప్యాకింగ్ లకు మాత్రం మినహాయింపు
  • శాసనసభలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటన
పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ విషయంలో తమిళనాడు సర్కారు కఠిన చర్యలకు దిగింది. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పలు ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ జెండాలు, తాగు నీటి ప్యాకింగ్ కు వినియోగించే సాచెట్లపై ఈ నిషేధం ఉంటుందని పళనిస్వామి తెలిపారు. పాలు, పెరుగు, నూనె, మందుల ప్యాకింగ్ లకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమలుకు ప్రజలు, వర్తకులు సహకరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నియమించిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పళనిస్వామి తెలిపారు. వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతున్నాయని, భూగర్భ జలాలకు సమస్యాత్మకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. తదుపరి తరానికి కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించేందుకు గాను 2019 జనవరి 1 నుంచి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.
Tamilnadu
PLASTIC

More Telugu News