East Godavari District: చంద్రబాబును అడ్డుకునేందుకు బీజేపీ నేతల ప్లాన్.. నిఘా వర్గాల హెచ్చరిక... నేతల ముందస్తు అరెస్ట్!

  • నేడు చంద్రబాబు అమలాపురం పర్యటన
  • బీజేపీ నేతలతో పాటు కాపు నేతల హౌస్ అరెస్ట్
  • ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారన్న బీజేపీ నేత మాలకొండయ్య
నవనిర్మాణ దీక్షలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించనుండగా, అక్కడి బీజేపీ నేతలు అడ్డుకునేందుకు చూస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు, ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్యను గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు దాటేందుకు వీల్లేదని చెబుతూ, ఇంటిముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో, ఆయన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించిన ఆయన, తాము చంద్రబాబును అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు.

మాలకొండయ్య గృహ నిర్బంధం గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆయన ఇంటికి వస్తుండటంతో ఈ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మాలకొండయ్యతో పాటు మరికొందరు బీజేపీ నేతలనూ ముందస్తు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కాపు వర్గం ఈ ప్రాంతంలో అధికంగా ఉండటం, వారి నుంచి కూడా వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో, కొందరు కాపు నేతలనూ హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. కాగా, నేడు అమలాపురంలో జరిగే నవనిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు ఈ ఉదయం రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. 
East Godavari District
BJP
Telugudesam
Chandrababu

More Telugu News