rajanala: చివరి రోజుల్లో సీరియల్లో వేషం అడగడానికి రాజనాల రావడం బాధాకరం: నటుడు అడబాల

  • రాజనాల గొప్ప నటుడు 
  • విలన్ అనగానే గుర్తొచ్చేది ఆయనే 
  • ఒకసారి పద్మాలయ స్టూడియోకి వచ్చారు  
ఇటు వెండి తెరపైనా .. అటు బుల్లితెరపైన ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన 'అడబాల' మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తెలుగు పాప్యులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'రాజనాల' గురించి ప్రస్తావించారు. "తెలుగు సినిమాల్లో విలన్ అనగానే ఎవరికైనా సరే రాజనాల గుర్తుకొస్తారు. అలాంటి రాజనాల ఒకసారి పద్మాలయ స్టూడియో మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి వచ్చారు. అక్కడ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది .. ఆయనని చూడగానే నేను నమస్కరించాను.ఆ టీవీ సీరియల్ ను డైరెక్ట్ చేస్తోన్న దర్శకుడు రాజనాలను గుర్తుపట్టలేకపోయాడు. నేను వెళ్లి రాజనాల గారు వచ్చిన విషయం ఆ డైరెక్టర్ కి చెప్పాను. ఆయనను నేనేమీ పిలవలేదే అనుకుంటూనే ఆ డైరెక్టర్ .. రాజనాల దగ్గరికి వెళ్లాడు. "ఏదైనా వేషం వుంటే చెప్పండి" అని రాజనాల అడగడం విని బాధతో నేను తల్లడిల్లిపోయాను. అంతటి నటుడు వచ్చి టీవీ సీరియల్లో ఛాన్స్ ఇవ్వమని అడగడం మనసును భారం చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయనకి ఒక కాలు తీసేయడం .. మరికొంత కాలం తరువాత చనిపోవడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.
rajanala
adabala

More Telugu News