Chandrababu: 98 శాతం పనులు చేసి.. 2 శాతం చేయకపోతే అదే ప్రజల్లోకి వెళుతుంది: చంద్రబాబు

  • ఆ రెండు శాతం పనులు కూడా పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలి
  • 2019లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం
  • నాలుగేళ్లలోనే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం
  • కుప్పం టీడీపీ నేతలతో చంద్రబాబు
వందకి 98 పనులు చేసినా, 2 పనులు చేయకపోతే.. ఆ రెండు పనులు చేయలేదనేదే ప్రజల్లోకి వెళుతుందని, కాబట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ ఆ రెండు పనులు కూడా పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయామో వివరించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు తనను కలవడానికి వచ్చిన కుప్పం నేతలు, కార్యకర్తలతో అమరావతిలోని గ్రీవెన్స్ సెల్ లో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... "కుప్పం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తి దృష్టిపెట్టి పూర్తిచేశాం. మిగిలినవి కూడా ఈ డిసెంబర్ కల్లా పూర్తిచేస్తాం. ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుంది. ఇంకా నాలుగైదు వేల ఇళ్లు నిర్మించాల్సివుంది. అవి కూడా పూర్తయితే కుప్పంలో అందరికీ ఇళ్లు ఏర్పడినట్లే.

త్వరలోనే అవి కూడా పూర్తయ్యేలా చూస్తాం. హంద్రీనీవా ప్రాజెక్టు ఏడాదిలో పూర్తి చేస్తాం, కుప్పంకు సాగునీరు, తాగునీరు అందిస్తాం. కుప్పం ప్రజలు నన్ను మాత్రమే గెలిపించడం కాదు, భారీ ఆధిక్యతనిచ్చి చిత్తూరు ఎంపీ స్థానాన్నే తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తున్నారు. 30 ఏళ్లుగా వరుసగా గెలిపిస్తున్నకుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిది.

పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉంది. సమ్మిట్ లో చేసుకున్న 2500 ఎంవోయూల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు, 35 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే ఇస్తున్నాం. ముస్లింలకు రూ.1100 కోట్ల బడ్జెట్ పెట్టడం రాష్ట్రచరిత్రలో ఇదే తొలిసారి. దుల్హన్ పథకం, ఇమాంలు, మౌజన్ లకు జీతాలు, హజ్ భవన్ ల నిర్మాణం, స్వయం ఉపాధికి చేయూత ఇస్తున్నాం. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇదే ప్రథమం.

రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఇతర చేతి వృత్తుల వారికి 75 యూనిట్ల వరకు ఉచిత కరెంటు నిన్ననే ప్రకటించాం. మన స్వయం కృషితోనే ఈ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం సాధించాం. దీనికి కేంద్రం సహకారం తోడైతే మరింత అభివృద్ధి, సంక్షేమం సాధించేవాళ్లం. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. నాలుగేళ్లలోనే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివి కూడా 38 చేశాం. ఇవన్నీ చేశాం కాబట్టే రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందాలి" అని పేర్కొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News