aamudala valasa: అవసరమైతే జగన్ ను కూడా చంద్రబాబు ఆలింగనం చేసుకుంటారు!: పవన్ కల్యాణ్

  • 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తాయి
  • ఓటుకు నోటు కేసులో కేంద్రానికి బాబు భయపడుతున్నారు
  • శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, భూ కబ్జాలే  
  • ఏపీని టీడీపీ నాయకులు కబ్జా ఆంధ్రప్రదేశ్ గా మార్చారు
చంద్రబాబు అవసరమైతే జగన్ ను కూడా ఆలింగనం చేసుకుంటారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. ఓటుకు నోటు కేసు విషయంలో కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు.

ప్రజలు, ‘జనసేన’ రోడ్లపైకి వస్తున్నారంటే  చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, భూ కబ్జాలే కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో ఇసుక మ్యూజియం వస్తుందంటూ సెటైర్లు వేశారు. ఏపీలో ఎక్కడ భూమి కనిపించినా టీడీపీ నేతలు లాగేసుకుంటున్నారని, భూమిని, మట్టిని దోచుకునేవారు మట్టిలో కలిసిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని టీడీపీ నాయకులు 'కబ్జా ఆంధ్రప్రదేశ్'గా మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టు గురించి పవన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా అక్కడి ప్రజలను మెడపట్టి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మోసం చేయొద్దని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడికెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు కనిపిస్తున్నారని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

మనకు కావాల్సింది పార్టీల జెండాలు కాదని, జాతీయ జెండా ముఖ్యమని సూచించారు. తమ పార్టీకి పూర్తి మద్దతు వస్తే ఉద్యోగుల సీపీసీ స్కీమ్ ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యేలు, మంత్రి అచ్చెన్నాయుడు గురించి ఆయన ప్రస్తావించారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించొద్దని వీరికి హితవు పలికారు.
aamudala valasa
Pawan Kalyan

More Telugu News