Kumara swamy: కుమారస్వామి అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు.. ఐదేళ్లూ ఉంటారా మరి.. వెంటాడుతున్న సెంటిమెంట్!

  • చేదు అనుభవం మిగులుస్తున్న విధాన సౌధ
  • ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే పూర్తికాలం పదవి డౌటే
  • కుమారస్వామి ఆ చరిత్రను మారుస్తారా?
మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసి గద్దెనెక్కారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని హేమాహేమీలందరూ హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఇప్పుడు మరో ప్రశ్న రాజకీయ పండితులను కుదురుగా ఉండనివ్వడం లేదు. సీఎం అయిన కుమారస్వామి ఐదేళ్లూ ఆ పదవిలో ఉంటారా? అనేదే ఆ ప్రశ్న.

ఈ ప్రశ్న ఉదయించడానికి బలమైన కారణం కూడా ఉంది. విధానసౌధ ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఎవరూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేదని గత చరిత్ర చెబుతోంది. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం నిర్వహించేవారు. కానీ, 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధాన సౌధ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే పదవిని కోల్పోయారు. అదే ఏడాది మరోమారు ముఖ్యమంత్రి అయినా ఈసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పదవి చేజార్చుకున్నారు.

అంతకంటే ముందు 1990లో బంగారప్ప కూడా ఇలాగే విధాన సౌధ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. కావేరీ నదీ జలాల విషయంలో అల్లర్లు చెలరేగడంతో రెండేళ్లలోనే పదవి నుంచి తప్పుకున్నారు. 2006లో కుమారస్వామి కూడా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి 20 నెలలకే పదవి కోల్పోయారు.  2008లో యడ్యూరప్పకూ ఇదే అనుభవం ఎదురైంది. అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కుమారస్వామి విధానసౌధ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మరి గత చరిత్రను ఆయన మారుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.
Kumara swamy
Karnataka
vidhan soudha

More Telugu News