TTD: శ్రీవారి నిధుల కోసం తవ్వించారు... చంద్రబాబుపై రమణ దీక్షితులు డైరెక్ట్ అటాక్!

  • పల్లవ, చోళరాజుల ఆభరణాల కోసం తవ్వకాలు
  • వంటగదిలోనే వాటిని దాచినట్టు పూర్వీకులు చెబుతుండేవారు
  • చంద్రబాబు ఆదేశాల మేరకే తవ్వకాలు జరిగాయి
  • జాతీయ చానల్ ఇంటర్వ్యూలో రమణ దీక్షితులు
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారికి పల్లవ, చోళ రాజులు ఇచ్చిన విలువైన ఆభరణాలను, ముస్లింలు, విదేశీయుల దండయాత్రల నుంచి కాపాడేందుకు వంటగదిలో రహస్యంగా దాచి పెట్టినట్టు తమ పూర్వీకులు చెబుతుండేవారని, ఇప్పుడు వాటిని దక్కించుకోవడం కోసం ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తవ్వకాలు జరిపారని మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు సంచలన విమర్శలు చేశారు.

ఓ జాతీయ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బయటి నుంచి వచ్చే వారికి తవ్వకాలు సాధ్యం కాదని, టీటీడీలో తమవారిని నియమించుకుని ఈ పని చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. నిధి నిక్షేపాల కోసం తవ్వకాలు జరిగాయనడానికి తన వద్ద ఉన్న ఆధారం, వంటగదిలో జరిగిన మార్పులేనని, గదిలో కొత్త ఫ్లోరింగ్ గోడలు, ఇటుకలు మారాయని తెలిపారు.

తిరుమల ఆలయంతో పాటు రాష్ట్రంలోని పురాతన కోటల్లోనూ నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే టీటీడీలో అత్యధికంగా ఉన్నారని, వారి ద్వారానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించిన ఆయన, పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి వద్ద రూ. 50 కోట్ల విలువైన శ్రీవారి నగలను దాచి పెట్టారని ఆరోపించారు. టీటీడీ సొమ్మును తిరుపతి కోసం, ఒంటిమిట్ట కోసం, రహదారుల నిర్మాణం కోసం వాడుతున్నారని, ఇలా నిధులను మళ్లించడం కూడా నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
TTD
Tirumala
Tirupati
Ramana Deekshitulu
Chandrababu

More Telugu News