Uttar Pradesh: నిన్న తండ్రి.. నేడు కుమారుడు: మహిళలపై చెయ్యేస్తే నరికేస్తామన్న యూపీ మంత్రి కుమారుడు!

  • మహిళలను అసభ్యంతా తాకే వారి చేతులు నరికేస్తానన్న నేత
  • పార్టీ అధికారంలోకి రాగానే చర్యలు
  • తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆయన తండ్రి
భారతీయులందరూ అవినీతిపరులేనని, అది వారి రక్తంలోనే ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్బర్ రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. ఇప్పుడాయన కుమారుడు, సుహుల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) నేత అరవింద్ రాజ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. సోమవారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు, యువతులను అసభ్యకరంగా తాకే వారి చేతులు నరికి పారేస్తానని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో ముందడుగు వేస్తామన్నారు.

కాగా, ఆయన తండ్రి ఓం ప్రకాశ్ రాజ్బర్ ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు మన చుట్టూ ఉన్నారని, వారికి వ్యతిరేకంగా గొంతెత్తి, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఊరుకుంటే సరిపోదని అన్నారు. విదేశాల్లో ఉన్నటువంటి చట్టాలను తీసుకురావాలని, ఇటువంటి వారిని నడిరోడ్డుపై ఉరి తీయాలని అన్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కెప్టెన్ అని, తానేం చెబితే ఆయన అదే చేస్తారని వ్యాఖ్యానించారు.
Uttar Pradesh
BJP
Arvind Rajbhar

More Telugu News