Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేలను కొన్నవాళ్లా, మమ్మల్ని విమర్శించేది?: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • నియమాలకు కట్టుబడే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు
  •  ఏపీ రాజకీయంగా పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది
  • అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను తీసుకుని పదవులిచ్చారు
కర్ణాటకలో బీజేపీకి తగినశాస్తి జరిగిందంటూ పలు పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తన దైన శైలిలో కౌంటరిచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవసరం లేకపోయినప్పటికీ ఏపీలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వాళ్లకు మంత్రి పదవులిచ్చిన వాళ్లా తమను విమర్శించేదని మండిపడ్డారు. ఎంతో నియమ నిబద్ధతలతో ఆలోచించి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదని చెప్పారు.

 ఈ సందర్భంగా ఏపీలో అధికార పార్టీపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. ఏపీ రాజకీయంగా పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, అవసరం లేకపోయినా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని, వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన పార్టీకి తమ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని అన్నారు. కొత్తగా వచ్చిన రాజకీయపార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినా కొంత అర్థముంటుంది తప్ప, ఆ పార్టీకి మాత్రం ఆ హక్కు కూడా లేదని, అసలు, ఈ అంశం గురించి ప్రస్తావించడం కూడా సమయం వృథా చేసుకోవడమేనని అన్నారు.

‘ఇప్పుడు.. టీడీపీ-వైసీపీ కలసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎంత విచిత్రంగా ఉంటుందో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అదేవిధంగా ఉంటుంది. ఏమైనప్పటికీ ఏపీలో కుటుంబపాలనా వ్యవస్థను మరో పదినెలలు ప్రజలు భరించాలి..తప్పదు.. అంతకన్నా మనమేమీ చేయలేం’ అన్నారాయన. 
Andhra Pradesh
vishnu kumar raj

More Telugu News