హైదరాబాద్ అమ్మాయిని నిలువునా ముంచేసిన ముగ్గురు... ఢిల్లీలో అరెస్ట్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ వింగ్!
- కాల్ సెంటర్ పేరిట మోసాలు
- ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే రూ. 5.40 లక్షలు నొక్కేసిన ఘనులు
- అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తెచ్చిన పోలీసులు
మౌలాలీకి చెందిన ఓ అమ్మాయి, ఉద్యోగం కోసం 'షైన్ డాట్ కామ్' అనే వెబ్ సైట్ లో దరఖాస్తును అప్ లోడ్ చేసింది. ఆపై ఓ వ్యక్తి ఫోన్ చేసి, తానో మల్టీ నేషనల్ కంపెనీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నని పరిచయం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1,850 చెల్లించాలని చెప్పి, పేటీఎం ఖాతాలో వేయించుకున్నాడు. ఆ తరువాత పలు కారణాలు చెబుతూ బ్యాంకు ఖాతాల్లో, వాలెట్లలో డబ్బులు వేయించుకున్నాడు. ఆపై ఓ మారు సదరు యువతికి ఫోన్ చేసి ఓటీపీ చెప్పించుకున్నారు. ఆపై ఆమె బ్యాంకు ఖాతా నుంచి 100కు పైగా లావాదేవీలు చేసుకుని రూ. 5.40 లక్షలను దోచుకున్నారు. దీనిపై సదరు యువతి ఫిర్యాదు చేయగా, విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.