Tirumala: రమణ దీక్షితులు ఔట్... వెంకన్న సన్నిధిలో నలుగురు కొత్త ప్రధాన అర్చకుల నియామకం

  • పుట్టా బాధ్యతలు తీసుకున్న తరువాత సంచలన నిర్ణయాలు
  • 65 ఏళ్లు దాటినవారిని సాగనంపిన పాలక మండలి
  • కొత్త అర్చకుల నియామకం
  • ఇకపై అర్చకులు ఏం చేయాలన్నది కూడా పాలకమండలి చేతిలోనే
గతకొన్ని దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ దేవదేవుడి సేవలో తరిస్తున్న ఏవీ రమణదీక్షితులు తొలగింపు ప్రక్రియ పూర్తయింది. టీటీడీ కొత్త చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, తొలి సమావేశంలో, 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు పదవీ విరమణను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓవైపు దుమారం చెలరేగుతుండగానే, రణమ దీక్షితులు తొలగింపు ప్రక్రియ పూర్తయిందని ప్రకటించిన టీటీడీ, నలుగురు కొత్త వారిని ఆలయ ప్రధాన అర్చకులుగా నియమించింది.

పూర్వపు మిరాశీ వ్యవస్థ ఆధారంగా, గొల్లపల్లి కుటుంబం తరఫున వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి వారి తరఫున శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ వంశీయుల నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇక ఆలయంలో అర్చకులకు ఏఏ విధులను అప్పగించాలన్న అధికారం, ఇంతవరకూ ప్రధాన అర్చకుల చేతిలో ఉండగా, ఆ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ, డిప్యూటీ ఈఓకు ఆ అధికారాన్ని బదలాయిస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా కలకలం రేపుతోంది.
Tirumala
Tirupati
Ramana Deekshitulu
TTD

More Telugu News