Andhra Pradesh: పన్నెండు కేసుల్లో ఏ1 గా ఉన్న నువ్వా చంద్రబాబును విమర్శించేది? : జగన్ పై మంత్రి సోమిరెడ్డి ఫైర్

  • గుడివాడ సభలో జగన్ రెచ్చిపోయి మాట్లాడారు
  • వైెఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుంది మీరు కాదా?
  • రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది మీరు కాదా?
సీఎం చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబు  ఏ1’ అంటూ జగన్ వ్యాఖ్యలు చేయడం దారుణమని, గుడివాడ సభలో జగన్ రెచ్చిపోయి తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

‘జగన్.. పన్నెండు కేసుల్లో ఏ1గా ఉన్న నువ్వా .. చంద్రబాబును విమర్శించేది? వైెఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుంది మీరు కాదా? రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది మీరు కాదా?’ అని విమర్శించారు. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ వాటి నుంచి బయటపడేందుకు ఆత్మగౌరవాన్ని ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఏపీ ప్రజల కోసం మోదీని ఎవరైతే నిలదీస్తారో వారే హీరో అని అన్నారు.

ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం మోసం చేసిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రైతులకు మేలు చేస్తున్న కేంద్రం..ఏపీలో రైతులను మోసం చేస్తోందని వాపోయారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ డబ్బులు పంచుతోందని ఆరోపించారు.
Andhra Pradesh
Jagan
somireddy

More Telugu News