Kerala: అబ్బాయికి పెళ్లి వయసు లేకున్నా, వివాహం చెల్లుబాటు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

షార్ట్స్‌లో చూడండి
పెళ్లి చేసుకునే సమయానికి అబ్బాయికి 20 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని, తన కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఓ తండ్రి వేసిన కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అబ్బాయి నందకుమార్ కు 21 సంవత్సరాలు నిండకపోయినప్పటికీ, వారిద్దరినీ తాము మేజర్లుగానే భావిస్తున్నానని, వారిద్దరూ కలసి జీవించే హక్కును కలిగున్నారని, ఈ కేసులో 20 సంవత్సరాల అమ్మాయి తుషారా కోరుకుంటే, ఆ అబ్బాయితోనే కలసి జీవించవచ్చని స్పష్టం చేసింది.

కాగా, అంతకుముందు ఈ వివాహం చెల్లబోదని కేరళ హైకోర్టు తీర్పిస్తూ, తుషారను తండ్రి దగ్గరికి పంపింది. ఇక ఇదే కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం, వీరి వివాహం చెల్లుతుందని ప్రకటించింది. వీరిద్దరి మధ్యా ఉన్న 'లివ్-ఇన్ రిలేషన్ షిప్'కు జాతీయ గృహ హింస చట్టం 2005 ప్రకారం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా హదియా కేసును న్యాయమూర్తులు ప్రస్తావించారు. గతంలో కేరళ హైకోర్టు హదియా విషయంలోనూ పూర్తిగా విచారించకుండా తప్పుడు తీర్పిచ్చిందని తెలిపారు. కేవలం ఒకవైపు నుంచి వాదనలు విని తీర్పివ్వరాదని న్యాయమూర్తులు కేరళ హైకోర్టుకు అక్షింతలు వేయడం గమనార్హం.
Go Back to Shorts
Kerala
High Court
Supreme Court
Marriage

More Telugu News