Chandrababu: మనిషి మృగంలా బతకడానికి వీల్లేదు: సీఎం చంద్రబాబు

  • దాచేపల్లి ఘటనలో బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు
  • ఈ ఘటన చాలా బాధాకరం
  • బాధితురాలికి సంఘీభావంగా ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తాం
మనిషి ఒక మృగంలా బతకడానికి వీల్లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. దాచేపల్లి ఘటనలో అత్యాచారానికి గురైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, దాచేపల్లి ఘటన చాలా బాధాకరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, రాష్ట్రానికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం దారుణమంటూ పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. బాధితురాలికి సంఘీభావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తామని, ‘ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం’ అంటూ నిర్వహించే ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 
Chandrababu
Andhra Pradesh

More Telugu News