Bihar: బీహార్లో పట్టపగలు.. నడిరోడ్డుపై కీచక పర్వం.. బాలిక దుస్తులు చింపి.. కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
దేశంలో దారుణాలకు అంతూపొంతూ  లేకుండా పోతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతుండడంతో అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు సరికదా.. మరింత పెచ్చుమీరుతున్నాయి. తాజాగా బీహార్‌లో వెలుగుచూసిన సంఘటన సభ్య సమాజానికే తలవంపులు తీసుకొచ్చింది.

పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొందరు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్తున్న ఆమెను అడ్డగించి, దుస్తులు విప్పేందుకు ప్రయత్నించారు. బాలిక ఎదిరించడంతో ఆమె దుస్తులు చింపేశారు. కాలు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. చుట్టూ అందరూ ఈ ఘటను సినిమా చూస్తున్నట్టు చూశారు తప్పితే నిస్సహాయంగా కేకలు పెడుతున్న బాలికను రక్షించేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు సరికదా వేడుక చూస్తూ వీడియోలు తీసుకున్నారు.  

జెహానాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పాట్నా జోనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నయ్యర్ హుస్సైన్ తెలిపారు. వీడియోలోని బైక్ నంబరు ఆధారంగా ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని పోలీసులు తెలిపారు .
Go Back to Shorts
Bihar
patna
girl
Viral Videos

More Telugu News