Andhra Pradesh: ఏపీలో బీజేపీకి మరో ఝలక్.. మోదీ తిరుపతి ప్రకటనకు ప్రత్యక్ష సాక్షి కారుమంచి రాజీనామా.. రేపు టీడీపీలో చేరిక!

  • రాజీనామా పత్రాన్ని అమిత్ షాకు పంపిన జయరామ్
  • రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు శ్రమిస్తున్నారని ప్రశంస
  • టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానన్న కారుమంచి
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ చేశారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో ఆయన సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

పోలీసు అధికారి అయిన కారుమంచి గత సాధారాణ ఎన్నికల సందర్భంగా ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. గత కొన్నాళ్లుగా పార్టీ అధిష్ఠానంపై కినుక వహించిన ఆయన ఇటీవల తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి పార్టీ మార్పుపై స్నేహితులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. అనంతరం రాజీనామా నిర్ణయానికి వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు మూడు గ్రూపులు, ఆరు ముఠాలుగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. నరేంద్రమోదీ తిరుపతి ప్రకటనకు తానే ప్రత్యక్ష సాక్షినని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని తిరునామంపై వేలెత్తి చూపిస్తూ చెప్పారని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. చంద్రబాబు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, టీడీపీలో చేరడాన్ని గర్వంగా భావిస్తున్నానని జయరామ్ వివరించారు.
Andhra Pradesh
BJP
Telugudesam
Karumanchi jayaram

More Telugu News