Karnataka: బెంగళూరులో ప్రయాణికులతో ఉన్న ప్రైవేటు బస్సు హైజాక్!

  • తీసుకున్న రుణం చెల్లించని బస్సు యజమాని
  • పోలీసులమని చెప్పి బెదిరించి కిడ్నాప్ 
  • నలుగురి అరెస్ట్, కేసు నమోదు
తీసుకున్న రుణం చెల్లించలేదన్న కారణంతో ఓ ఫైనాన్స్ సంస్థ ప్రయాణికులతో ఉన్న బస్సును హైజాక్ చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే 42 మంది ప్రయాణికులతో ఉన్న ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి కేరళకు బయలుదేరగా, ఆర్ఆర్ నగర్ ప్రాంతంలో రెండు బైకులపై వచ్చిన దుండగులు, తాము పోలీసులమని, తనిఖీలు చేయాల్సి వుందని చెబుతూ, బస్సును అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ గోడౌన్ కు తీసుకెళ్లారు.

బస్సును లోపలే ఉంచి బయట తాళం వేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు, పోలీసులకు విషయాన్ని చేరవేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయేందుకు ప్రయత్నించగా, నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బస్సును కొనుగోలు చేసే సమయంలో తీసుకున్న రుణాన్ని యజమాని చెల్లించకపోవడంతోనే ఫైనాన్స్ సంస్థ ఈ పని చేసిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Karnataka
Bus
Kidnap
Police

More Telugu News