Rahul Gandhi: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం, గద్దర్ కుమారుడు

  • కాంగ్రెస్ లో చేరిన పలువురు నేతలు
  • కండువాలు కప్పి ఆహ్వానించిన రాహుల్
  • కాంగ్రెస్ కోసం కృషి చేయాలని సూచన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ టీడీపీ నేత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంచి పట్టున్న నేత నాగం జనార్దన్ రెడ్డి ఈ ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్ వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఆహ్వానించిన రాహుల్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని సూచించారు.వారందరికీ పార్టీ కండువాలు కప్పారు.

కాగా, తనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా సూర్యకిరణ్ వెల్లడించారు. ప్రస్తుతం సూర్యకిరణ్ నిఫ్ట్ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ)లో రీసెర్చ్‌ అసోసియేట్‌ గా పని చేస్తున్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆయన ఆశిస్తున్నారు.
Rahul Gandhi
Nagam Janardhan Reddy
Surya kiran
Gaddar

More Telugu News