Uttar Pradesh: మరణించాడనుకున్న వ్యక్తి.. చితి మీద నుంచి లేచొచ్చాడు!

  • భూరాసింగ్ మరణించాడని నిర్ధారించిన వైద్యులు
  • అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు
  • చితిపై నుంచి లేచిన భూరాసింగ్
మరణించిన వ్యక్తికి ఇక తలకొరివి పెడతారనగా.. ఆ వ్యక్తి హఠాత్తుగా చితి మీద నుంచి లేచొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌ జిల్లా కిర్తలా గ్రామానికి చెందిన రామ్‌ కిషోర్‌ సింగ్‌ (53) ను గ్రామస్థులంతా భూరాసింగ్‌ అని పిలుస్తారు. నిన్న భూరాసింగ్ లో ఉన్నట్టుండి ఏ కదలిక లేకపోవడంతో ఏమైందోనన్న ఆందోళనతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతనిని పరీక్షించిన వైద్యులు మరణించాడని నిర్ధారించారు. దీంతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించాల్సిన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

 అంతా కలిసి పాడెపై శ్మశానానికి తీసుకెళ్లారు. చితి పేర్చారు. ఇక మంటపెట్టడమే తరువాయి.. ఇంతలో అకస్మాత్తుగా భూరాసింగ్ లేచి కూర్చున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన బంధువులు.. ఏం జరిగిందని ఆయనను అడుగగా.. తనకు పెద్దగా జ్ఞాపకం లేదు కానీ, తానో చోటుకి వెళ్లానని, అక్కడ మరి కొంత మంది కూర్చుని ఉన్నారని చెప్పాడు. అక్కడ పెద్ద గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి 'ఇతన్ని అప్పుడే ఎందుకు తెచ్చారు?' అంటూ ప్రశ్నించాడని, ఇతనిని తీసుకొచ్చేందుకు ఇంకా సమయం ఉందని తెలిపాడని చెప్పాడు.

 ఆ తరువాత తనను ఎవరో తోసేసినట్టైందని, కళ్లు తెరిచి చూసేసరికి బంధువులంతా కనిపించారని అంటున్నాడు. దీంతో ఆయనను ఇప్పుడు మిరకిల్ మ్యాన్ గా గ్రామస్థులు పిలుచుకుంటున్నారు. దీనిపై వైద్యనిపుణులు మాట్లాడుతూ, అతడు చనిపోవడం నిజం కాదని అన్నారు. ఒక్కోసారి గుండె బాగా నెమ్మదిగా కొట్టుకోవడం వల్ల కోమాలోకి వెళ్తారని, దీంతో వారు చనిపోయినట్టుగా వైద్యులు పొరపాటు పడతారని, వాస్తవానికి వారు బతికే ఉంటారని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని వారు చెబుతున్నారు. 
Uttar Pradesh
alighad district
dead man

More Telugu News