YS Jagan: మరో కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు.. తనతో సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా?

  • అగిరిపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం
  • సమయం చూసుకుని అందరం రాజీనామా చేద్దామన్న జగన్
  • 30న విశాఖలో వంచన దినం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఎంపీలతో రాజీనామా చేయించిన ఆయన తనతో సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం పాదయాత్ర ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా అగిరిపల్లిలో ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎంపీలతో రాజీనామా చేయించిన తర్వాత హోదా పోరాటానికి ఊపు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దెబ్బతో యూటర్న్ తీసుకున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. ఎంపీలు చేసినట్టుగానే ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని అభిప్రాయపడగా, జగన్ అందుకుని.. ఎమ్మెల్యేల రాజీనామా పెద్ద విషయం కాదని, దశల వారీగా వ్యూహాలను అమలు చేద్దామని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యేలందరం సరైన సమయంలో రాజీనామా చేద్దామని అన్నట్టు సమాచారం.

ఈనెల 30న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన సభ పెడుతున్నారని, అదే రోజున లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు విశాఖపట్టణంలో 12 గంటలపాటు ‘వంచన దినం’ నిర్వహించాలని జగన్ ఆదేశించారు.

More Telugu News