mecka masjid case: జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాను ఆమోదించని హైకోర్టు.. మళ్లీ విధులకు హాజరు!

  • 'మక్కా మసీదు పేలుళ్ల' కేసును కొట్టేసిన జడ్జి  
  • రాజీనామా తిరస్కరణ.. సెలవు సైతం రద్దు
  • దీంతో విధులకు యథావిధిగా హాజరు
2007 మే 18న పాతబస్తీలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మక్కా మసీదులో జరిగిన పేలుళ్ల కేసులో ఇటీవల సంచలన తీర్పు వెలువరించి, ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేసిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి అనూహ్యంగా గురువారం మళ్లీ విధులకు హాజరయ్యారు. దీనికి కారణం ఆయన చేసిన రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆమోదించలేదు. దీనికి తోడు జడ్జి రవీందర్ రెడ్డి సెలవును కూడా రద్దు చేయడంతో తిరిగి విధులకు హాజరయ్యారు.

మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి రవీందర్ రెడ్డి ఈ సోమవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. నాటి పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. తీర్పు తర్వాత జడ్జి రవీందర్ రెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్ కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నారు. తీర్పుతో దీనికి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
mecka masjid case
judge ravinder reddy

More Telugu News