kolkata: కోల్‌కతాపై ఎవరెస్ట్ శిఖరాన్ని మించిన మేఘం.. తుపాన్లతో పశ్చిమబెంగాల్ అతలాకుతలం!

  • జంట తుపాన్లతో పశ్చిమ బెంగాల్ అతలాకుతలం
  • రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మృతి
  • స్తంభించిన రవాణా వ్యవస్థ
జంట తుపాన్లతో పశ్చిమబెంగాల్ అతలాకుతలం అవుతోంది. నైరుతి, తూర్పు దిక్కుల నుంచి దూసుకొచ్చిన తుపాన్లు కోల్‌కతాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. గంటకు 84, 98 కిలోమీటర్ల వేగంతో ఏకకాలంలో దూసుకొచ్చిన రెండు తుపాన్ల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో అంధకారం నెలకొంది. వీధులన్నీ జలమయమయ్యాయి. రైలు, రోడ్డు రవాణా స్తంభించిపోయింది. విమానాలు ఎయిర్‌పోర్టుకే పరిమితమయ్యాయి.

తుపాను దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మరణించారు. కోల్‌కతాలో ఓ ఆటోపై చెట్టు కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆనంద్‌పూర్, బెహలా, హౌరాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కోల్‌కతాలో పది కిలోమీటర్ల ఎత్తులో 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ భారీ మేఘం కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేఘం ఎవరెస్టు శిఖరం కంటే 13 శాతం పెద్దగా ఉన్నట్టు చెప్పారు. ఈ మేఘం వర్షిస్తే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
kolkata
West Bengal
storm
Cyclone

More Telugu News