Jagan: ఇక్కడి ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట: విజయవాడలో జగన్ సెటైర్

షార్ట్స్‌లో చూడండి
'ఇక్కడి ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌ చదివాడట' అని టీడీపీ నేత జలీల్‌ ఖాన్‌ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు విజయవాడలోని చిట్టినగర్‌ సెంటర్‌లో పాదయాత్ర నిర్వహించిన జగన్ ఈ సందర్భంగా ర్యాలీలో మాట్లాడుతూ... డబ్బులు తీసుకుని అమ్ముడు పోయి పార్టీ మారిన కొందరు అభివృద్ధి కోసమే అలా చేశామంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. వారి పక్కనే సీఎం ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు తీర్చాలని అడగరని విమర్శించారు.

అలాగే, చంద్రబాబు విజయవాడలోనే ఉంటారు కానీ, ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరని జగన్ అన్నారు. అభివృద్ధి చేయరు కానీ అవినీతి మాత్రం చక్కగా చేస్తారని, విజయవాడలో ఒక్క ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోతోన్న చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని కడతానని అంటున్నారని విమర్శించారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ఇప్పటికీ కట్టలేకపోయారని, మరోవైపు రాజధాని స్కాంలకు నిలయమైందని అన్నారు. చంద్రబాబు చెబుతోన్న అసత్యాలకు అదుపు లేకుండా పోతోందని అన్నారు.

అప్పట్లో హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకి వెళ్లే మార్గం కోసం 19 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ ను వైఎస్సార్ 3 ఏళ్లలోనే పూర్తి చేశారని, చంద్రబాబు కనీసం ఫ్లై ఓవర్‌ కట్టలేరు కానీ, అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జపాన్ వెళ్లి బుల్లెట్ ట్రైన్‌ వస్తుందంటారని, అమెరికా వెళ్లి వచ్చి మైక్రోసాప్ట్‌ను తీసుకొస్తున్నానని చెబుతారని జగన్ చురకలంటించారు. ఈ విషయాలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారు రాజధానికి వ్యతిరేకమని ఎదురుదాడికి దిగుతారని అన్నారు.
Go Back to Shorts
Jagan
Vijayawada
YSRCP

More Telugu News