bullet train: ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు టికెట్ ధరలివే!

  • బుల్లెట్ ట్రైన్ లో టికెట్ కనీస ధర 250 రూపాయలు
  • గరిష్ట టికెట్ ధర 3,000 రూపాయలు
  • బిజినెస్ క్లాస్ టికెట్ ధర 3,000 కంటే ఎక్కువ
ముంబై-అహ్మదాబాద్‌ మధ్య త్వరలో ప్రారంభించనున్న బుల్లెట్‌ రైలుకు సంబంధించిన పలు వివరాలను నేషనల్ బుల్లెట్ ట్రైన్ కార్పొరేషన్ ఎండీ అచల్ ఖరే వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలను ఈ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం, లెక్కల ప్రకారం నిర్ణయించామని, ఈ ధరలు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని అన్నారు. బాంద్రా-కుర్లా స్టేషన్ల మధ్య ట్యాక్సీలో ప్రయాణించేందుకు 650 రూపాయల వ్యయంతో గంటన్నర సమయం పడుతోందని అన్నారు. అదే బుల్లెట్ రైలులో 250 రూపాయల టికెట్ ధరతో కేవలం 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చని చెప్పారు.

బుల్లెట్ రైలు నిర్దేశిత సమయం కంటే 40 సెకన్లకు మించి ఆలస్యం కాబోదని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుందని ఆయన చెప్పారు. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున రోజులో 70 సార్లు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు. బుల్లెట్ ట్రైన్ టికెట్‌ ధరలు ప్రస్తుతం అమల్లో ఉన్న ఏసీ మొదటి తరగతి ధరలతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువగా ఉంటాయని ఆయన వెల్లడించారు. బుల్లెట్ రైలులో మినిమం టికెట్‌ ధర 250 రూపాయలు ఉండగా, గరిష్ఠంగా 3000 ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

 ఈ ట్రైన్ లో బిజినెస్‌ తరగతి ప్రయాణికుల టికెట్‌ ధర 3000 కంటే ఎక్కువ ఉంటుందని ఆయన వెల్లడించారు. పది కోచ్‌ లు ఉండే ఈ బుల్లెట్ ట్రైన్ లో ఒక బిజినెస్‌ క్లాస్ కోచ్‌ ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కోచ్ లో ప్రయాణించే వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, 2023 నాటికి బుల్లెట్‌ ట్రైన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని రైల్వేబోర్డు ఛైర్మన్‌ అశ్వని లొహాని వెల్లడించారు.
bullet train
mumbai-ahmadabad
nbtc

More Telugu News