Akash Ambani: మాకింత డబ్బుందని అమెరికాలోనే తెలిసింది: ఆకాశ్ అంబానీ

  • ధనవంతుల జాబితా ఉంటుందని కూడా తెలియదు
  • చాలా సాదాసీదాగా పెరిగాం
  • ఫోర్బ్స్ లో చూసిన తరువాతే తెలిసింది
  • ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ
తన కుటుంబం ఆసియాలోనే అత్యంత సంపన్నమైన కుటుంబమన్న సంగతి అమెరికాలో చదువుతున్న సమయంలో ఫోర్బ్స్ మేగజైన్ లో చూసేంత వరకూ తనకు తెలియదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ చెప్పాడు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆకాశ్, ధనవంతుల జాబితా అంటూ ఒకటి ఉంటుందని, అందులో తమ కుటుంబం ఒకటన్న సంగతి తెలుసుకున్నాక, తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పారు.

చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన స్కూల్ లో ఇతర విద్యార్థులతో పోలిస్తే, తనకు తక్కువ పాకెట్ మనీ ఇచ్చేవారని, ఇంట్లో ఎన్నడూ వ్యాపారాలకు సంబంధించిన అంశాలను చర్చించలేదని అన్నారు. తాతయ్యతో కబుర్లు, ఆదివారం బ్రీచ్ క్యాండీ క్లబ్ కు వెళ్లి ఆనందించడం మాత్రమే చేసేవాళ్లమని, చాలా సాదాసీదాగా పెరిగామని చెప్పుకొచ్చారు. తాతయ్య, నాన్నలా కాకుండా తనకంటూ సొంత పేరు సంపాదించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని చెప్పిన ఆకాశ్... మరికొన్ని నెలల్లో తన చదువు పూర్తవుతుందన్న సమయంలోనే జియో గురించి తన తండ్రి చెప్పాడని, దాంతో ఆ ప్రాజెక్టుకు కనెక్ట్ అయ్యానని అన్నారు.

కాగా, ఆకాశ్ వివాహం త్వరలోనే ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకతో జరగనుందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి కలసి చదువుకున్నవారు కాగా, వీరి స్నేహం ప్రేమగా మారి, పెద్దల అనుమతితో ఒకటి కాబోతున్నారు.
Akash Ambani
Mukesh Goud
Reliance

More Telugu News