mayavathi: టీడీపీ కూడా మిమ్మల్ని నమ్మలేదు.. మీరా మాట్లాడేది?: మాయావతి

  • అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో నవ భారత్ ను నిర్మిస్తారా?
  • మీ అహంకారంతో మీకు ఒక్కొక్క పార్టీ దూరమవుతోంది
  • మీ మిత్రపక్షం టీడీపీ.. ఏకంగా అవిశ్వాసమే పెట్టింది

విపక్షాలను కుక్కలు, పిల్లులు, బాతులు, ముంగిసలు అంటూ విమర్శించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. టీడీపీ సహా మిత్రపక్షాలు అన్నీ దూరమవుతున్న తరుణంలో బీజేపీ ఒంటరిగా మారుతోందని... అందుకే అమిత్ షా ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారని... దీంతో, ఆ పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలోకి పడిపోయారని అన్నారు. ఉప ఎన్నికలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై ఇలాగే నోరు పారేసుకుని, భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారని చెప్పారు. మోదీ, అతని శిష్యుడు అమిత్ షా నాయకత్వంలో బీజేపీ విలువలు నీచమైన స్థాయికి దిగజారాయని విమర్శించారు. ఈ మేరకు ఆమె అమిత్ షాకు ఓ లేఖ రాశారు.

అసహ్యమైన మాటలు, ఇతరులను చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? ఇదేనా మీరు చెప్పే నవ భారతం? అంటూ లేఖలో అమిత్ షాను మాయావతి కడిగిపారేశారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటివి గౌరవాన్ని ఇస్తాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఉన్న అహంకారం, అతి విశ్వాసం కారణంగా... మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయని... బీజేపీ ఇప్పుడు ఒంటరి అయిందని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలను కూడా మీరు నెరవేర్చలేక పోయారని... దీంతో, మీకు ఎప్పట్నుంచో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ... ఏకంగా మీపై అవిశ్వాసమే పెట్టిందని ఎద్దేవా చేశారు. 

More Telugu News