Telugudesam: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసు నమోదైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, విడాకులిచ్చి తనతో ఉండాల్సిందిగా నామా నాగేశ్వరరావు తన భార్యను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణన్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45కు చెందిన సీకే రామకృష్ణన్ అమెరికాలో ఉంటుండగా, అతని భార్య సుజాత రామకృష్ణన్ జూబ్లీహిల్స్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సుజాత ఇంటికి నామా తరచూ వచ్చి వెళ్లేవారు. తాను అమెరికాలో ఉండగా ఓ రోజు భార్య సుజాత ఫోన్‌ చేసి నామా, ఆయన సోదరుడు నామా సీతయ్య బెదిరిస్తున్నారని చెప్పిందని రామకృష్ణన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ధైర్యం చెప్పడంతో అప్పుడే నామాపై సుజాత జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు.  

రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన తనకు భయంకరమైన విషయం తెలిసిందని, నామాతో తనకు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని సుజాత చెప్పిందని రామకృష్ణన్ పేర్కొన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోనే ఉండాల్సిందిగా నామా ఇటీవల ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సుజాత తనతో చెప్పి కన్నీరు పెట్టుకుందని రామకృష్ణన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నామా సోదరుడు సీతయ్య కూడా బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. రామకృష్ణన్ ఫిర్యాదుతో నాగేశ్వరరావు, సీతయ్యపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
Telugudesam
Nama Nageswara Rao
Hyderabad
Police
Case

More Telugu News