Pawan Kalyan: అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్లీ అలాంటి పరిస్థితులు రావచ్చు!: పవన్ కల్యాణ్ హెచ్చరిక

  • రాజధాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
  • అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు
  • మళ్లీ ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉంది
  • రాయలసీమ ఉద్యమం రావచ్చు
ఏపీ రాజధాని విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళితే విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని, అలాంటి పరిస్థితులు రాకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్లీ ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, రాయలసీమ ఉద్యమం రావచ్చని అన్నారు.

అమరావతి రాజధాని తమది అనే భావన ఏపీ ప్రజలందరిలో కలిగించకపోతే మంచిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. మరోసారి ప్రత్యేక తెలంగాణలాంటి ఉద్యమాలు రాకుండా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. పాలకులు చేస్తోన్న పనుల వల్ల, అసమానతల వల్ల అస్థిత్వ పోరాటాలు ప్రారంభమవుతాయని, అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తే ఆ పరిస్థితి రాదని చెప్పారు.

 హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకుంటారని, అప్పట్లో హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధిని కేంద్రీకృతం చేశారని అన్నారు. రాజ‌ధానిలో అంద‌రికీ భాగ‌స్వామ్యం క‌ల్పించ‌క‌పోతే అస‌మాన‌త‌లు పెరిగిపోయి.. క‌ళింగ ఆంధ్ర లాంటి ఉద్య‌మాలు వ‌స్తాయ‌ని హెచ్చ‌రించారు. 
Pawan Kalyan
Vijayawada
Jana Sena

More Telugu News