Facebook: చాలా పెద్ద తప్పు చేశాను... ఇంకొక్క అవకాశం ఇవ్వండి: వేడుకుంటున్న మార్క్ జుకర్ బర్గ్

  • ఫేస్ బుక్ లో డేటా చౌర్యం
  • తప్పును మరోమారు అంగీకరించిన జుకర్ బర్గ్
  • క్షమించాలని మీడియా ముందు వేడుకున్న చీఫ్

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో యూజర్లు దాచుకుంటున్న సమస్త సమాచారమూ పరుల పాలైందని వచ్చిన వార్తలు సంస్థ పరువు తీసిన నేపథ్యంలో, ఇప్పటికే నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తనను క్షమించాలని కోరారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, తాను చాలా పెద్ద తప్పు చేశానని, మన్నించి, సంస్థను మరింత ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్లేందుకు ఇంకొక్క అవకాశాన్ని ఇవ్వాలని వేడుకున్నాడు.

థర్డ్ పార్టీకి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నియమ నిబంధనల లోపాల కారణంగానే ఇది జరిగిందని వెల్లడించిన ఆయన, కేంబ్రిడ్జి ఎనలిటికాలో జరిగిన కుంభకోణం తరువాత ఫేస్ బుక్ డేటా చౌర్యం సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో ఖాతాలున్న 8.7 కోట్ల మంది వివరాల చోరీ జరుగగా, ఇందులో అత్యధిక ఖాతాలు అమెరికన్లవే. 2004లో ఫేస్ బుక్ ను స్థాపించిన జుకర్ బర్గ్, కొన్ని తప్పులు జరిగినందువల్లే డేటా చౌర్యానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు.

ఇప్పటికీ సంస్థను సమర్థవంతంగా నడిపించగలనన్న నమ్మకం తనకుందని చెప్పాడు. జరిగిన డేటా చౌర్యానికి తన తప్పే కారణమని అన్నాడు. తప్పులు చేయడం మానవ సహజమని, సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. తప్పు జరిగిందని తానే ఒప్పుకున్నానని గుర్తు చేశారు.

More Telugu News