ramakrishna: ఈ నెల 15, 24న.. వచ్చేనెల 6న సదస్సులు, సభలు: పవన్‌తో భేటీ తరువాత సీపీఐ రామకృష్ణ

  • పవన్ డిమాండ్ చేశారు
  • అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టారు
  • లేదంటే దేశ వ్యాప్తంగా ఇంతటి చర్చ జరగకపోయేది
  • ఢిల్లీలో మోదీపై టీడీపీ, వైసీపీ పోరాడాలి
రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడే క్రమంలో తాము దశల వారీగా ప్రణాళికలు ప్రకటిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఫిబ్రవరి 8న వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన తరువాతే ఏపీలోని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడడం మొదలుపెట్టాయన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేయకపోతే పార్లమెంటులో ఇప్పుడు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టేది కాదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఇంతటి చర్చ జరగకపోయేదని అన్నారు.

విజయవాడలోని జనసేన కార్యాలయంలో సీపీఎం నేత మధు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత తమ ఉద్యమ కార్యాచరణపై రామకృష్ణ మీడియాకు వివరిస్తూ... పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకపోవడం దారుణమని అన్నారు. టీడీపీ, వైసీపీలకు రాజకీయ భేదాభిప్రాయాలు ఉంటే రాష్ట్రంలోనే మాట్లాడుకోవాలని, ఢిల్లీలో మోదీపై పోరాడాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడే క్రమంలో తాము దశల వారీగా ప్రణాళికలు ప్రకటిస్తామని, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్యని అన్నారు.

తాము ఈ నెల 6న నిర్వహించనున్న పాదయాత్రలో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీలో వెనకబడిన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఆయా ప్రాంతాల ప్రజల గుండెలు మండుతున్నాయని అన్నారు. తాము అనంతపురంలో ఈ నెల 15న, ఒంగోలులో 24న, విజయనగరంలో మే6న సదస్సులు, సభలు ఏర్పాటు చేస్తున్నామని, మేధావులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు చేస్తున్నారని, గోరక్షక దళాల పేరుతోనూ దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ramakrishna
Pawan Kalyan
Jana Sena

More Telugu News