sri reddy: ఆ అమ్మాయి నాపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరం.. ఆమెను వదిలిపెట్టను: డైరెక్టర్ శేఖర్ కమ్ముల

  • నేను కలవని, చూడని అమ్మాయి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి
  • ఆమె మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే
  • క్షమాపణలు చెప్పకపోతే... చట్టపరంగా చర్యలు తీసుకుంటా
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములపై సినీ నటి శ్రీరెడ్డి పరోక్ష విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలు పక్కలోకి తప్ప ఇంకెందుకూ పనికిరారని ఓ బక్కపలుచని దర్శకుడు అనుకుంటారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై శేఖర్ కమ్ముల స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఫేస్ బుక్ ద్వారా ఖండించాడు.

"నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతి మాటా అబద్ధం. అసభ్యకరం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్తాపాన్ని కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడని అమ్మాయి... నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.

స్త్రీల సమానత్వం, సాధికారతలను నేను ఎంతగా నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను" అంటూ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
sri reddy
sekhar kammula
tollywood
sexual abuse

More Telugu News